Sunday, 15 August 2010

సిరివెన్నెల విరిజల్లులు -4 : You & I


జల్సా సినిమాలోని ఈ పాట ఆ సినిమా విడుదలైన కొత్తలో మా రూమ్మేట్ laptop లో ఒక సారి ప్లే చేస్తే యధాలాపంగా విన్నాను. "అదే మనం తెలుగులో అంటే... dont worry be happy" - ఈ వాక్యం వినగానే నాకు ఈ పాట అంటే చిరాకొచ్చింది. తెలుగులో వచ్చిన అసంఖ్యాకమైన అర్ధం పర్ధం లేని పాటల్లో ఇది కూడా ఒకటిలే అనిపించి లైట్ తీస్కున్నాను (పాట రాసిందెవరో అప్పుడు నాకు తెలియదు).దృష్టి పెట్టి వినకపోవడం వలనో అప్పుడు ఆ పాట ప్లే చేసిన చెత్త స్పీకర్స్ వలనో కాని సంగీతం కూడా అంత వినసొంపుగా అనిపించలేదు. సినిమా చూసేటప్పుడు పెద్దగా ఉత్సాహం లేకుండా పవన్ కళ్యాన్ చేసిన స్టెప్స్ చూసి నా ఆవలింతలకి నోటికి ముందు చిటికెలు వేసుకుంటూ కూర్చున్నాను.


కాని మొన్నీ మధ్య ఒకరోజు లోకల్ ట్రైన్లో కూర్చుని నా walkman లో పాటలు వింటుంటే మధ్యలో ఈ పాట వచ్చింది. సరేలే టైం పాస్ కోసం విందాం అని వింటే అప్పుడు అనిపించింది ఇది అంత తీసి పారేయ్యల్సిన పాట కాదని. ఇంకో రెండు సార్లు వినగానే చాలా నచ్చింది. ఒక వారం పాటు మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాను. ముఖ్యంగా సాహిత్యంలో కొన్ని వాక్యాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.

ఉదయాన్నే నిద్ర లేచిన ఒక కవికి, అందమైన ఉషోదయాన్ని , చుట్టూ వెలుగును నింపుతూ నెమ్మదిగా పైకి వస్తున్న ఎర్రని సూర్యుడిని చూస్తున్నప్పుడు ఒక రకమైన ఆలోచనలు కలిగితే, అదే సూర్యుడిని చూస్తున్న శాస్త్రవేత్తకి , ఉగ్రవాదికి పూర్తి భిన్నమైన ఆలోచనలు కలుగచ్చు. ప్రపంచం మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అలాగే మనం ప్రతి రోజు చూసే విషయాలని, జరిగే చిన్న చిన్న సంఘటనలని అనుభవించడం ఆస్వాదించడం పూర్తిగా మన మనసుని బట్టే ఉంటుంది. మన జీవితం ఎంత అందంగా ఉంది అన్నది మన పరిస్థితుల కంటే కూడా, వాటిని మనం చూసే పద్ధతిని బట్టే ఉంటుంది. కాబట్టి జీవించే పద్ధతిని బట్టే జీవితం ఉంటుంది. ఇదంతా కింద ఇచ్చిన సాహిత్యంలో bold లో పెట్టిన వాక్యాలకు నా interpretation. ఇంత గొప్ప భావాన్ని ఇటువంటి పదాల్లో చెప్పడం ఆయనకే చెల్లు.యే జిందగీ నడవాలంటే హస్ దే హస్ దే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా ఆగిందా ఆటం బాంబేస్తే
చల్ చక్దే చక్దే అంటే పడినా లేచొస్తామంతే

హకూనా మటాటా* అనుకో తమాషగా తల ఊపి
వెరైటిగా శబ్దం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి
అదే మనం తెలుగులో అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I let's go high and do balle balle..
Life is like a saturday night lets do balle balle..

||చ -1||
ఎన్నో రంగుల జీవితం
నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా

ఉంటే నీలో నమ్మకం
కన్నీరైనా అమృతం
కష్టం కూడా అద్భుతం కాదా

బొటానికల్ భాషలో పెటల్సు పూరేకులు
మెటీరియల్ సైన్సులో కలలు మెదడు పెను కేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు

||You and I ||

||చ -2 ||
పొందాలంటే విక్టరీ
పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లా మరి బోలో

ఎక్కాలంటే హిమగిరి
ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖ్లో

ఉటోపియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుఫోరియా ఊపులో ఎగసి ఎగసి చలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం
||You and I ||


* "హకూనా మటాటా" అనే పదానికి అర్ధం సింపుల్ గా చెప్పాలంటే "All izz well" :) . మరిన్ని వివారాలు కావాలంటే ఇక్కడ క్లిక్కండి. ఈ పదాన్ని పాటలో వాడాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇతని ముందు సినిమాల్లో కూడా కొన్ని ఇటువంటి పర భాషా పద ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి.

ఇక పొతే ఈ పాటలో "మెటీరియల్ సైన్సు" అనే పదం ఈ సందర్భంలో వాడాల్సింది కాదు. నాకు తెలిసినంత వరకు మెటీరియల్ సైన్సుకు కలలకు సంబంధం లేదు :). కాని కవి భావం అర్ధం కావడానికి మాత్రం ఈ విషయం అడ్డం రాదు.

ఇక ఇందులోని "అదే మనం తెలుగులో అంటే dont worry be happy " అనే వాక్యానికి అర్ధం నాకు ఇప్పటికీ తెలియలేదు. దాని ముందు, తరువాత ఉన్న వాక్యాలను కలిపి ఆలోచించినా నాకు ఏమీ బోధపడడంలేదు. ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. మీ బ్లాగులో కామెంటు పెట్టి ఋణం తీర్చేసుకుంటాను :)