Sunday 26 September 2010

డైరెక్టర్ సుకుమార్

    సమకాలీన తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న వారికి సుకుమార్ పేరు తెలియకుండా ఉండదు. ఆర్య సినిమాతో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు మరల్చుకున్న దర్శకుడు సుకుమార్. ఒక దర్శకుడిగా ఆయనను రాష్ట్రం మొత్తం గుర్తించినా, మాలో కొంతమందికి మాత్రం ఆయన ఇప్పటికీ సుకుమార్ సర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆయన మా మాథ్స్ లెక్చరర్.

   'ఎంసెట్ అంటే ఒక దయ్యం. చేతబడి చేసినా లొంగదు. ఎంసెట్ అంటే ఒక భూతం. కానీ ఈ భూతమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రెండేళ్ళు మీరు పుస్తకాల పురుగుల్లాగా ఉండిపోతేనే తరవాత సీతాకోక చిలుకల్లగా ఎగరగలరు' అంటూ ఊరికే భయపెట్టేసే మిగతా మాస్టర్ల 'క్లాసులు' విని నీరసం వచ్చిన మాకు , షర్ట్ మొదటి బటన్ పెట్టకుండా వదిలేసి, చేతులు పైకి మడత పెట్టి , చాక్ పీసులు చేతిలో పట్టుకుని సుకుమార్ సర్ క్లాస్ కి వస్తుంటే అప్పటి వరకు ఉన్న నీరసం ఒక్కసారిగా ఎగిరిపోయేది. ఆయన క్లాస్ లో అందరం యాక్టివ్ గానే ఉండేవాళ్ళం. ఆయన మెదడు ఎంత చురుకుగా ఉంటుందో నడక, మాట కూడా అంతే వేగంగా ఉంటాయి. అలా ఆయనను చూస్తూ ఉంటె ఆ ఉత్సాహం మాకు కూడా వచ్చేసేది. అయన క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరైనా పక్కనుంచి వెళ్తూ చూస్తే అయన చాలా ఫాస్ట్ చెప్పేస్తున్నాడు అసలు స్టూడెంట్స్ ఫాలో అవగలరా అన్నట్టు ఉంటుంది. కాని నిజానికి ఆయన చెప్తే అర్ధం కాకపోవడం అనే ప్రశ్నే ఉండదు.

    అప్పట్లో మాకు మాథ్స్ కి ముగ్గురు, ఫిజిక్స్ కి ఇద్దరు , కెమిస్ట్రీ కి ఇద్దరు చప్పున రెండేళ్లలో చాలా మంది లెక్చరర్స్ వచ్చారు. ఇప్పటికీ అంత మందిలో నీకు ఇష్టమైన సర్ ఎవరు అని మాలో ఏ ఒక్కడినైనా అడిగితే బయటకి వచ్చేవి రెండో,మూడో పేర్లు మాత్రమే. అందులో సుకుమార్ సర్ పేరు లేకుండా ఉండదు.

     అయన కొన్నాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి కొన్నాళ్ళు ఎందుకో విరామం తీసుకుని మళ్ళీ టీచింగ్ కి వచ్చారు. ఆ సంవత్సరం లోనే మేము ఆయన విద్యార్ధులం. అయన మాకు క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టిన కొన్నాళ్ళ తరవాత ఎవరో చెప్తే విన్నాను ఈయన సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు అని. ఒక రోజు 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పేపర్ లో చిన్న ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనలో ఒక మూల సుకుమార్ సర్ ఫోటో ఉంది. మరుసటి రోజు ఆయన క్లాస్ కి రాక ముందు నుంచి అందరు దీని గురించే చర్చ. ఆయన క్లాస్ కి రాగానే అందరం కలిసి ఒకే సారి 'ఓ' వేసుకున్నాం :) . ఆయన ఏమి మాట్లాడకుండా చెయ్యి పైకెత్తి సైగలతోనే 'Thank you','ఇంక చాల్లే' అని ఒకే సారి చెప్పేశారు. ఆయన మోహంలో ఆనందం స్పష్టంగా తెలిసింది. ఇది జరిగిన సరిగ్గా కొద్ది క్షణాలకే ఆయన క్లాస్ మొదలు పెట్టేసారు, పూర్తి ఏకాగ్రత తో. అంత తొందరగా ఆయన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుని అంత ఏకాగ్రతతో ఎలా చెప్పగాలిగారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

    ఆ సంవత్సరం పూర్తయ్యాక ఆయన మళ్లీ సినిమాల్లోకి వెళ్ళిపోయారు. 'హనుమాన్ జంక్షన్' కి పని చేస్తున్నారు అని తెలిసింది . ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మేము 20 మంది(ఇంకా ఎక్కువేనేమో) కలిసి ధియేటర్ కి వెళ్లి అక్కడ రచ్చో రచ్చ అన్నమాట \:D/ . కొన్నాళ్ళకి మాకు ఇంటర్ పూర్తయిపోయింది. అందరం విడిపోయాం. ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు దిల్ సినిమాకి పని చేసారు అని విన్నాము. తరవాత కొన్నాళ్ళకి ఆర్య సినిమా అనౌన్స్ అయింది. సుకుమార్ సర్ సినిమా , అది కూడా అల్లు అర్జున్ తోటి , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో అని తెలియగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక ట్రైలర్ T.V లో చుసిన రోజు అయితే పూర్తిగా shock అయ్యాను. అది ఎవరో అనామకుడు తీసిన సినిమా అయినా కాని ఆ ట్రైలర్ చూసి నేను వెంటనే ఫ్యాన్ అయిపోయేవాడిని. అలాంటిది 'మా' సుకుమార్ సర్ తీసిన సినిమా. ఇంత బాగా తీశారా అని  చాలా మురిసిపోయాను.

     సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు టికెట్లు ఎలా సంపాదించాలో అర్ధం కాలేదు. ఊర్లో ఉన్న మా క్లాస్మేట్స్ అందరు డబ్బులు కలెక్ట్ చేసి ధియేటర్ ముందు ఒక బ్యానర్ కట్టించారు. దానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. నాకు టికెట్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చి తరువాత హ్యాండిచ్చారు :( మొత్తానికి మొదటి రోజు చూడలేక పోయాను. సినిమా చూసొచ్చిన జనం మాత్రం అద్భుతం,సూపర్, డూపర్ అంటున్నారు. నాకు ఆసక్తి ఇంకా పెరిగిపోతోంది. రెండవ రోజు ఎలాగైనా టికెట్లు సంపాదించాలని ధియేటర్ కి వెళ్లాను. మనమేంటి బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూడడమేంటి అనుకుని (సినిమాకి అంత ఖర్చు పెట్టానంటే ఇంట్లో తంతారు కదా మరి)  క్యూలో నుంచుని టికెట్ కోనేద్దామని పోటుగాడిలా వెళ్లి ఆ తోపులాటలో నా పర్స్ ఎవరో కొట్టేసారు అని చూసుకుని బావురుమని ఇంటికొచ్చేసాను. మరుసటి రోజు జిమ్ లో మా ఫ్రెండ్ ఒకడు డంబెల్స్ పట్టుకుని ఊపేస్తూ ఆర్య చూసావా చాలా బాగుంది అన్నాడు.  సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచే డైరెక్టర్ ఫాన్ ని , నాకే దొరకేలేదు నీకు టికెట్ ఎలా దొరికింది అంటే బ్లాక్ లో కొన్నాను అన్నాడు. ఎంత అంటే 100 (అని గుర్తు) అన్నాడు. మరీ వందా (ఇప్పుడు మల్టిప్లెక్స్ లు వచ్చాక టికెట్ కి వంద మామూలు అయిపొయింది కాని అప్పట్లో మా ఊర్లో అది చాలా ఎక్కువే మరి ) అంటే, ఆ సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదురా వెంటనే చూడు అన్నాడు. వీడెవడో గొట్టం గాడే నా కంటే ముందే చూసేసి నాకే సలహాలు పారేస్తుంటే,  సర్ స్టూడెంట్ ని నేను అసలు తగ్గకూడదు అని ఆ రోజే బ్లాక్ లో టికెట్ కొని మొత్తానికి చూసాను.

    ట్రైలర్ చూసినప్పుడు కలిగిన ఆశ్చర్యానికి పదింతలు కలిగింది నాకు. కథ, కధనం ఒక ఎత్తు అయితే ఆ సినిమాకి ఫోటోగ్రఫి , సంగీతం ఇంకో ఎత్తు. అసలు సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది. ఇప్పటికీ ఆర్య నా all time favorites లో మొదటి వరసలోనే ఉంటుంది. ఆ సినిమా చూసొచ్చి గర్వంగా అందరికి చెప్పుకున్నాను 'ఆర్య డైరెక్టర్ మా సారే తెలుసా.' అని :) .జగడం సినిమా వచ్చినప్పుడు నేను పూణే లో ఉండడంతో ఆ సినిమా ధియేటర్ లో చూడడం కుదరలేదు. నాకు పైరేటెడ్ సీడీలో సినిమా చూడడం నచ్చదు. అందుకని చాలా ఆలస్యంగా డీవీడీ వచ్చిన తరువాత చూసాను. సినిమా అంతగా ఆడలేదు, మా ఫ్రెండ్స్ కొంతమందికి కూడా నచ్చలేదు. అందరికీ ఎందుకు నచ్చలేదో తెలియదు కాని నాకు మాత్రం హీరోయిన్ ట్రాక్ తప్ప మిగతా సినిమా బాగా నచ్చింది. తీసుకున్న థీం కోసం తయారు చేసిన కథ , దాని చుట్టూ అల్లిన సన్నివేశాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇక ఆర్య -2 లో నాకు నచ్చిన విషయాలు చాలా ఉన్నా నచ్చనివి కుడా బాగానే ఉన్నాయి.

    ఇప్పుడు ఆయన క్లాస్ చెప్పిన రోజులు గుర్తొస్తే భలే సరదాగా అనిపిస్తుంది. ఆయన క్లాస్ మొత్తం చాలా సరదాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళం అందరం. విచిత్రం ఏమిటంటే, నాకు గుర్తున్నంత వరకు ఆయన రెండు , మూడు సార్లు మాత్రమే క్లాస్ లో జోక్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ జోకులకి నాకైతే నవ్వు రాలేదు :D . ఆర్య సినిమాలో కామెడీ చూసినప్పుడు అనుకున్నాను , అప్పట్లో ఈ క్రియేటివిటీ అంతా ఎక్కడ దాచేసారు సార్ అని :) . అప్పట్లో మాథ్స్ లెక్చరర్ గా లాజికల్ థింకింగ్ మీదే ధ్యాస పెట్టి ఆయన క్రియేటివ్ మైండ్ కి విశ్రాంతి ఇచ్చారేమో. ఆర్య -2 లో హీరోయిన్ తండ్రి అజయ్ ని కిడ్నాప్ చేస్తే ఆర్య గీతని విలన్ ఇంట్లో పెట్టి, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాను, నువ్వు అజయ్ ని విడిపిస్తే నేను నీ కొడుకుని వదులుతాను అని చెప్పే సీన్ చూసినప్పుడు అనుకున్నాను, సార్ మీ లాజికల్ బ్రెయిన్ ఎక్కడికి పోలేదు అని :)