Monday 22 November 2010

ఐస్ స్కేటింగ్... ఆహా... ఓహో...

గమనిక: ఇందులోని పాత్రలు సన్నివేశాలు పూర్తిగా నిజాలే, నిజ జీవితంలోని వ్యక్తులతో, సంఘటనలతో పోలిక కలిగి ఉండడం ఏ మాత్రం కాకతాళీయం కాదని తెలియజేయడానికి చింతిస్తున్నాను.



            రెండు నెలల క్రితం రెండవ సారి ఐస్ స్కేటింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంది. ఈ సారి మాత్రం ముచ్చటగా మూడో సారి వెళ్తున్నాం, ఛాంపియన్ లెవెల్ లో కాకపోయినా కనీసం ఐస్ మీద డాన్సు చేసేంత రేంజ్ లో అయినా నేర్చేసుకోవాలని జబ్బలు చరిచేసుకుని, (షేవ్ చేసేసిన) మీసాన్ని ముని వేళ్ళతో మెలేసి రింక్ లో అడుగు పెట్టాను. 'ఆహా ప్రవీణ్ నువ్వు సూపర్ గా చేస్తున్నావు' అని మా ఫ్రెండ్స్ అనగానే ఉబ్బి పోయి, తబ్బి పోయి, మాకు నేర్పించవా అని అడగగానే ఆలోచించకుండా ఒప్పేసుకుని దెబ్బయిపోయాను. సగం సమయం వాళ్ళని చెయ్యి పట్టుకుని రింక్ చుట్టూ తిప్పించడమే సరిపోయింది. మధ్య మధ్యలో దొరికిన కొంచెం గ్యాప్ లో నా మానాన నేను స్కేటింగ్ చేస్కుంటుంటే,....... సడెన్ గా ఎవడో వెనక నుంచి నాకు దగ్గరగా వస్తున్నట్టు అనిపించింది. విషయం అర్ధం అయ్యే లోపే డాష్ ఇచ్చేసాడు.

ధబ్!!! (శబ్దం)
నడుమిరిగిందిరో......!!!! (ఆర్త నాదం)

   అయినా 'పట్టువదలని ప్రవీణ్ ని నేను' అని నన్ను నేను మోటివేట్ చేసుకుని, 'తెలుగు వీర లేవరా... స్కేట్సు కట్టి సాగరా' అని మనసులో ఒక సాంగేస్కుని మళ్ళీ లేచి మొదలు పెట్టాను. ఒక్క రౌండ్ వేసి వచ్చేసరికి..... పట్టుకున్న గోడని వదలలేక, ఉన్న చోట నుంచి కదలలేక, కనీసం సరిగ్గా నిలబడ లేక అవస్థలు పడుతున్న మా ఫ్రెండ్స్ మీద జాలేసింది. వాళ్ళు జాలిగా అర్ధిస్తూ నా వంక ఒక చూపు చూడగానే గుండె కరిగిపోయి, మళ్ళీ వాళ్ళ కోరిక మీద చెయ్యి పట్టుకుని స్కేటించడం మొదలు పెట్టాను. సాయంత్రానికల్లా స్కేట్ డాన్స్ చేసెయ్యాలన్న నా కల నెరవేరనివ్వట్లేదు అని వాళ్ళని తిట్టుకుంటూనే... కమిట్ అయ్యాక క్యా కరేఁ అనుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను.

     ఈ గొడవ ఇలా ఉంటే... దాహంతో ఒయాసిస్ కోసం వెతుకుతున్న వాడికి ఓల్డ్ మాంక్ రమ్ ఇచ్చి తాగమన్నట్టు, నాకు నేనుగా స్కేటింగ్ చేస్కోవడానికి దొరికిన కాస్త టైం లో లూయీ (మాతో పాటు వచ్చిన బ్రిటిష్ లేడి) వచ్చి "come on praveen... come with me..." అనేసి శర వేగంతో స్కేట్ చేసేస్తోంది. ఆవిడ స్పీడ్ ని అందుకునే ప్రయత్నంలో ఇంకో సారి ధబ్!!! కెవ్వ్‌వ్వ్‌వ్వ్...!!!!

    ఇక ఇలా కాదని ఆనందం సినిమాలో MS నారాయణ లాగా "ooooh... horrible sweating!" అనుకుంటూ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. కాసేపు విశ్రమించిన తరవాత మళ్ళీ ఉపక్రమిస్తూ, ఈ సారి పరాక్రమంతో ప్రవీణ్ అంటే ఏంటో నిరూపించాలి అని గట్టి పట్టుదలతో, అంతా శుభమే జరగాలని కొండంత ఆశతో, కుడి కాలు పైకెత్తి, స్టైలుగా ఐస్ మీద అడుగు పెట్టీ పెట్టగానే..... కాలు జారి........ ధబ్!! ohh noooooooo.....!!!

అప్పుడు అర్ధమయింది. కొన్ని సందర్భాలలో ఆశ, పట్టుదలతో పాటు జాగ్రత్త కూడా అవసరమని. ఈ సారి గోడ గట్టిగా పట్టుకుని కేర్ ఫుల్ గా కాలెట్టి మళ్ళీ మొదలెట్టాం. నా ఫ్రెండ్స్ నన్ను చూసి, నువ్వు పడడం చూసాం ప్రవీణ్, పాపం గట్టిగా తగిలినట్టుందే... అని జాలి పడి నన్ను మళ్ళీ కాకా పట్టేశారు. వాళ్ళ ఎదురుగానే నేను కింద పడుతున్నా  నా మీదే ఆధారపడుతున్న వాళ్ళ పరిస్థితికి జాలేసి , వాళ్ళు నన్ను అంత గొప్పగా చూస్తుంటే నా మీద నాకే ముచ్చటేసి, మళ్ళీ వాళ్ళ చెయ్యి పట్టుకుని నా టైం వేస్ట్ చేస్కున్నాక, కాసేపటి తరవాత మళ్ళీ నేను స్కేట్ చేస్కునే ఛాన్స్ వచ్చింది. అసలు నేను ఎంత స్పీడ్ గా వెళ్ళగలనో చూద్దామని ఒక చిలిపి కోరిక మొదలయింది. అలా నాకు కుదిరినంత స్పీడ్ తో దూసుకెళ్తూ ఉండగా.... సడన్ గా ఎవడో అడ్డొచ్చాడు. అరక్షణంలో అక్షర సత్యం గుర్తొచ్చింది. మనకి ముందుకి వెళ్ళడం వచ్చు కాని ఆగడం రాదు. మరుక్షణం అరిచాను. "ఒరేయ్....... తప్పుకోరా తెల్ల కుంకా. తప్ప్"..................
.............................. .................................. .................................. ............................... ...................... .................... ................................ఏదో జరిగింది....... ..................................... ................................... ............ ......ఏం జరిగింది?........................... .............................. ............................. ........................ ....ఏమో............................... ........................................... ......................................... ................................. .................. .................. .................. .............చుక్కలు కనిపిస్తున్నాయి ...................................... ...................... ........................ ................... ............................... చుక్కల మధ్యలో నుంచి......... .................... ....................... ................... ........................................ ......ఏదో గొంతు వినిపిస్తోంది..... ........................ ......................... ........ ఈ టైపు గొంతు ఎక్కడో విన్నానే....... ...................... ........................ ..................... ఎక్కడబ్బా??....................

నేడేచ్చూడండీ
మీ అభిమాన లండన్ ఐస్ స్కేటింగ్ రింక్ లో
" ప్రవీణ్ 'పడిన' పాట్లు "
విజయవంతమైన 4వ ధబ్!!!

ఏదో మిస్సింగ్ అనుకుంటున్నారు కదా? నిజమే....... ఈ సారి ఆర్తనాదం లేదు, చుక్కల మధ్య చీకట్లో కరిగిపోయిన నిశ్శబ్దపు నిట్టూర్పు తప్ప.
ఇంకేముంది?..... మోటివేషన్ మంచమెక్కింది. స్కేట్ డాన్స్ సంతకెళ్ళింది.

అంతరాయాలకి , అవాంతరాలకి చింతిస్తూ ఆ కార్యక్రమాన్ని అంతటితో సమాప్తం చేసేసి, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు రాత్రి అలసటతో ఆదమరచి నిద్రపోయిన నాకు, మరుసటి రోజు ఉదయాన్నే.....

Hey! What is this strange feeling?
నేను మొట్ట మొదటి సారి జిమ్ కి వెళ్ళిన రోజు గుర్తొస్తోందేంటబ్బా?

బుర్రలో ఒక సారి రీల్ రివైండ్ చేసుకుని ఆలోచిస్తే అర్ధమయింది. పడినప్పుడు తగిలిన దెబ్బలకి తోడు మా వాళ్ళని చెయ్యి పట్టుకుని తిప్పించినప్పుడు వాళ్ళ బరువంతా నా చెయ్యి మీదే వేసేయ్యడంతో భుజాలు, మెడ పట్టేసాయి. ఎవరైనా నా మెడని ముట్టుకుంటే మూలిగే పరిస్థితి. కాబట్టి ఎక్కడికీ కదలకుండానే ఆదివారమంతా గడిచిపోయింది :(

కొసమెరుపు:
తారకరత్న తార నటుడు (start actor) కావాలని తహ తహ లాడినట్టు
సుమన్ సినిమాలు తీయాలని సరదాపడుతున్నట్టు
నాకు ఈ మధ్య పద్యాలు రాయాలనే పైత్యం మొదలయింది.
అలా నా తీట కొలది రాసుకున్న ఆట వెలది.

ఆ.వె||
ఐసు స్కేటు సేతు నైసుగా నేనంచు
పరుగు లురక లిడుచు పయనమైతి
పడితి కాలు జారి పదిమంది నవ్వంగ
పరువు గంగఁ (థేమ్సుఁ) గలిసె పడతు లెదుట

:( :(