Saturday, 17 July 2010

మాకూ వచ్చు తెలుగు

కృష్ణ అని నా స్నేహితుడు ఒకడు మా కంపెనీ లోనే పని చేస్తున్నాడు. నేను పూణే లో వాడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళం  . రోజూ office communicator లో సొల్లు కబుర్లు చెప్పుకోవడం మాకు అలవాటు. "Hi dude! Weekend plans ఏంటి?" టైపులో మాట్లాడుకుని బోర్ కొట్టి ఒక రోజు నాకు కొత్త ఆలోచన వచ్చింది. మా వాడికి మాములుగానే చమత్కారాలు ఎక్కువ. నా ఆలోచన విని వాడు ఇంకా రెచ్చిపోయాడు. ఆ రెండు రోజుల మా సంభాషణలని ఇద్దరం సేవ్ చేసి పెట్టుకున్నాం . దాదాపుగా అది ఇలా ఉంటుంది.


(చదివే ముందు తెలియాల్సిన విషయాలు - మా వాడు అందరిని dude అనే పిలుస్తాడు. మేము కూడా వాడిని అలాగే పిలుస్తాం. అప్పట్లో మేము shifts లో పని చేసే వాళ్ళం. shift timings మధాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి పదింటి వరకు. )నేను: రేయ్
కృష్ణ: చెప్పు
నేను: ఇవాళ నుంచి మనకి ఒక పోటి
కృష్ణ: ఏంటి?
నేను: ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి
కృష్ణ: బాగుంది రా.
నాకు నచ్చినది. నేను మెచ్చితిని
నేను: ఈ క్షణమే ఆరంభం. చూపించుకో నీ తెలుగు జ్ఞానం
కృష్ణ: తప్పకుండా అందమైన తెలివైన యువకుడా
నేను: ??
కృష్ణ: అందమైన తెలివైన యువకుడు =dude

నేను: అదిరింది అందమైన తెలివైన యువకుడా :)
కృష్ణ: కృతజ్ఞుడ మిత్రమా
కృతజ్ఞుడను.
నేను: ఇంకేమి విశేషములు మిత్రమా
కృష్ణ: అన్నియును మామూలే మిత్రమా. ఇప్పుడే ఫలహారము భుజించి వచ్చితిని
నీవు ఎప్పుడు తినెదవు రాత్రి భోజనము?
నేను: నా కార్యాలయపు వేళలు ముగిసిన తరువాత భోజనశాల కు వెళ్లి భుజించెదను
కృష్ణ: మంచిది మిత్రమా.
నీ వంటి కార్యశీలులే అవసరము మన సంస్థకు
నేను: నిజం మిత్రమా

కృష్ణ: అందమైన తెలివైన యువకుడా... నేను ఇక కార్యాలయము నుండి నిష్క్రమించెదను
నేను: అటులనే మిత్రమా
కృష్ణ: శుభరాత్రి
నేను: రాత్రి గీతపై సంభాషణలో (online chatting) కలిసెదము
కృష్ణ: జాగ్రత్త వహించుము (take care)
సెలవు మిత్రమా
నేను: అటులనే మిత్రమా
మళ్ళీ రాత్రి కలిసెదము
కృష్ణ: మన సంభాషణను దాచిపెట్టుకుందును
నేను: తప్పకుండా
నేను కుడా
కృష్ణ: సరే మిత్రమా
వెళ్లి వచ్చెదను
నేను: ఎన్ని సార్లు చెప్పెదవు మిత్రమా. ఇంక వెళ్ళుము


(కాసేపటి తరవాత)


నేను: ఇంకయును నిష్క్రమించలేదా?
కృష్ణ: నా సంఖ్యా పరికరము నుండి బయటకు వచ్చుచుంటిని (signing off the computer)
నేను: అటులనా. తొందరగా ముగించుకుని దొబ్బేయుము
కృష్ణ: అటులనే. నా ద్విచక్ర వాహనముపై రయ్యి మని దొబ్బేయుదును


(మరుసటి రోజు )


నేను: ప్రణామము మిత్రమా
అంతా సౌఖ్యమేనా ?
కృష్ణ: ప్రణామము అందమైన తెలివైన యువకుడా
అంతా సౌఖ్యమే సోదరా
నేను: ఏమిటి విశేషములు ?
కృష్ణ: నిన్న నా సంఖ్యా పరికరము దొబ్బినది
అందుకనే గీతపైకి రాలేకపోతిని
నేను: అటులనా మిత్రమా. నీ కోసం ఎదురు చూస్తిని
ఆర్కుట్ నందు నీవు పెట్టిన ప్రియమైన చలన చిత్రము చూచితిని
నాకు నచ్చినది. ఎంతో స్ఫూర్తిదాయకముగా ఉన్నది.
కృష్ణ: కదా. యువకులను కార్యోన్ముఖులను చేసే విధముగానున్నది.

నేను: నా ప్రియమైన చలన చిత్రమును కూడా చూడుము
కృష్ణ: చూచెదను.
నేను: ఒక డప్పు వాద్యకారుడి చలన చిత్రము పెట్టితిని
కృష్ణ: భళారే
నేను: అది కూడా ఎంతో స్పూర్తిదాయకముగా ఉన్నది
కృష్ణ: స్పూర్తిని పొందెదను.
నేను: కళాపోషణ యొక్క విశిష్టతను గుర్తింపజేయును
కృష్ణ: నాకు ఆ చలన చిత్రము చూడవలెనని కుతూహలము పెరిగిపోవుచున్నది.
నేను: మంచిది. ఇంకేమి విశేషములు.
కృష్ణ: ఏమియు లేవు మిత్రమా


(కొన్ని గంటల తరవాత)


నేను: ఏమి చేయుచుంటివి
కృష్ణ: ఏమియును లేదు. నిద్ర వచ్చుచున్నది
నేటి నుండి రాత్రి వేళలో త్వరగా పవళించవలెను
లేనిచో ఇటులనే కార్యాలయము నందు నిదుర వచ్చును.
నేను: నిజమే.
కృష్ణ: అయినను సుభోదయము అయిన నాలుగు గంటలకు కాని నిదుర లేవడంలేదు.
త్వరగా పవళించి త్వరగా మేల్కొను పద్ధతిని అవలంబించవలెను నీటి దినము నుంచి.
అప్పుడు కాని ఆరోగ్యము ప్రాప్తించదు

నేను: మంచి నిర్ణయం మిత్రమా
నేను కూడా ఈ ఆలోచన పరిశీలించెదను
వీలైనచో నేను కూడా అవలంబించెదను
కృష్ణ: ఈ దినము నుంచి మనము ఈ పద్ధతిని అవలంబించెదము.
సంపూర్ణ ఆరోగ్యవంతులమై ఈ ప్రపంచమును అబ్బుర పరిచెదము మిత్రమా. అబ్బుర పరిచెదము.
నేను: కాని నేను వచ్చే మాసము నుండి కార్యాలయపు వేళలు ముగిసిన తరువాత వ్యాయమశాలకు
వెళ్ళవలెనని అలోచించుచుంటిని
ఈ పరిస్థితిన తొందరగా పవళించుట వీలు పడదేమో..
కృష్ణ: అది ఇంకను మంచి ఆలోచన
కనీసము రాత్రి పన్నెండు గంటల కైనను పవళించుము .
నేను: సరే.


(కాసేపటి తరవాత)


కృష్ణ: ఈ దినమున మనకి ఇంకొక అమ్మాయి పరిచయం ఐనది మిత్రమా
బహు బాగున్నది
నేను: నేను ఇది ఒప్పుకోను (అంతకు ముందు వారమే మనోడికి ముగ్గురు అమ్మాయిలు పరిచయం అయ్యారు అని చెప్పాడు)
ఎంతమంది అమ్మాయిలు బే నీకు?
కృష్ణ: పైగా మా కులమునకు చెందిన అమ్మాయే
నేను: ఇది ఇంకా దారుణం. కెవ్వ్!! (ఇది కేవలం కుళ్ళు ;) )
కృష్ణ: కాకపొతే ఒక బహు పెద్ద చిక్కు ఉన్నది మిత్రమా.
నేను: ఏంటో...
కృష్ణ: ఈ అమ్మాయి, నేను గీత (line) వేస్తున్న అమ్మాయికి స్నేహితురాలు
ఇద్దరికీ గీత వేసినచో రెండిటికి బొక్క పడునేమో అని భయముగా ఉన్నది.
అందువలనే జాగ్రత్త వహించుచుంటిని
నేను: రేయ్ గూట్లే గా
ఒక అమ్మాయికి ప్రయత్నిస్తూ ఆమె స్నేహితురాలిని కూడా వదలవా?

కృష్ణ: అటువంటి పదాలు వాడరాదు మిత్రమా
నేను: బాధకు భాష తెలియదురా
ఉక్రోషం అక్షరాలు చూడదురా
కృష్ణ: హ హ
ఈ అమ్మాయి దరహాసము భలే బాగున్నది
తనకి ఈ విషయం చెబుదాం అనుకుంటున్నా
నేను: చెప్పు
నువ్వు చెప్పగానే చెప్పు తీసి కొట్టాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా
కృష్ణ: లేదు మిత్రమా. ఆ అమ్మాయి మంచి పిల్ల. అలా చెయ్యదు.
నేను: అప్పుడే ఎలా తెలిసింది రా?
కృష్ణ: గీతపై సంభాషించితిని కదా. ఈ వారము మళ్ళీ ఒక సారి కలిసెదను
కాకపొతే కొంచెం చిన్న కాయం.
నేను: ఓహో సన్నగా ఉంటుందా.
చిన్నదే ఉంటుంది రా. నీతో పోలే కాయము దొరకడం కష్టము కదా.

కృష్ణ: హహ. గట్టిగా బయటకు నవ్వు (LOL: Laugh Out Loudly)
అయినను నేను ఆహార పానీయములు తగ్గించి (dieting) ఆ కాయముతో సారి తూగుటకు ప్రయత్నించెదను.
లేనిచో ఆ కాయము చేత బాగా తినిపించి మనతో తూగునట్టు చేస్కుందుము.
నేను: ఈ ఆలోచన భేషుగ్గా ఉంది.
ఇంకేమి విశేషములు మిత్రమా

కృష్ణ: మా ప్రదేశముపై(onsite) వాడితో కూడా ఇలాగే మాట్లాడెదనేమో అని భయముగానున్నది
నేను: ఇది మంచి పరిణామము
మనము అందరితోను ఇదే భాష కొనసాగించెదము
గ్రాంధిక తెలుగు యొక్క వాడుకను విస్తృతము చేయుదము
కృష్ణ: వాడు బెంగాలి వెధవ
బుర్ర గోక్కుంటాడు ఇలా మాట్లాడినచో
నేను: అవునా. అటులైన ఇది ప్రమాదము
వంగ రాజ్యపు వెధవలకు ఆంధ్ర భాష బోధపడదు.

కృష్ణ: బాగా పలికితివి
ఆ శ్రీధర్ గాడికి(మా స్నేహితుడే) మన సంభాషణ చూపుము
వాడికు కూడా కొంచెం తెలుగు వచ్చును.
నేను: వాడి మతి భ్రమించును
కృష్ణ: లెస్స పలికితివి
నాకు నిదుర తారా స్థాయి లో వచ్చుచున్నది
ఇక్కడ తూగుచుంటిని
నేను: నీ పక్కవాడిని ఒక లెంపకాయ పీకమని అభ్యర్దించుము
నిద్ర మటుమాయం అయిపోవును
కృష్ణ: మంచి సలహా ఇచ్చితివి మిత్రమా
ధన్యోస్మి
నేను: నేను సమావేసమునకు వెళ్ళుచుంటిని


(కొన్ని గంటల తరువాత )


నేను: మిత్రమా.నీవు ఏమి చేయుచుంటివి ఈ సమయమున .
కృష్ణ: ఆ అమ్మాయితో సంభాషించితిని గీతపై.
ఇంకను ఫలహార శాలకుపోయి బాగా మెక్కితిని
ఆ తదుపరి పుస్తకశాలకు వెళ్లి కొంత సమయము గడిపితిని
నేను: పని ఏమి లేదా మిత్రమా?
ఇటుల సమయమును వృధా చేయుచుంటివి?
కృష్ణ: పని ఉన్నది కాని పని చేయు ఆసక్తి కలుగుటలేదు ఈ దినమున.
నేను: ఎందువలనో?
కొత్త అమ్మాయి పరిచయం అయినందువలనా?
కృష్ణ: నిద్ర వలన.
నేను: అటులనా?
అటులైన నీవు నా సలహాను పాటించలేదా మిత్రమా?

కృష్ణ: పక్క వాడిని అడిగితిని ఒకటి పీకమని
వాడు భయపడి ఊరుకున్నాడు
తిరిగి నేను పీకితే తట్టుకోగల శక్తి వాడికి లేదని.
నేను: అయ్యారే...
అంత పిరికివాడా?
కృష్ణ: అంత బక్కవాడు.
నేను: అయ్యో పాపం.
ఇంకేమి విశేషములు
కృష్ణ: ఇంకేమియు లేవు మిత్రమా
అరేయ్. తిండికి వెళ్తున్నా. మళ్లీ వస్తా.


(కాసేపటి తరువాత)

కృష్ణ: తినేసి వచ్చితిని
నేను: ఇటుల పరి పరి మెక్కినచో పరిస్థితి చేజారిపోవునేమో మిత్రమా
కొంచెము నిగ్రహము వహించుము.
కృష్ణ: రాత్రి భోజనము త్వరగా ముగించుట మేలు మిత్రమా.
నేను: అవును మిత్రమా. కానీ సాయంత్రపు ఫలహారమునకు రాత్రి భోజనమునకు మధ్య కొంచెము సమయము ఉండవలెను కదా.
కృష్ణ: రెండు గంటలు ఉన్నది కదా
నేను: లెస్స పలికితివి అందమైన తెలివైన యువకుడా


(కాసేపటి తరువాత)


నేను: ఏమి చేయుచుంటివి
కృష్ణ: ఏదో పని ATY
నేను: ATY??
కృష్ణ: Andamaina Telivaina Yuvakudaa
నేను: అదిరింది మిత్రమా.
చిరుపేరు చిత్రముగానున్నది.
కృష్ణ: నీవు ఏమి చేయుచుంటివి?
నేను: ఇప్పుడే దూర్వాణి పరికరమున ఒక స్నేహితురాలితో మాట్లాడి వచ్చితిని.
కృష్ణ: సంతోషము.

నేను: మన ఈ సంభాషణ మన మిత్ర బృందమునకు చూపించిన యెడల నీకు ఏమైనను అభ్యంతరము కలదా?
కృష్ణ: ఏమియును లేదు మిత్రమా.
రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు చూపించు
పూర్తి హక్కులు నీకు ఇచ్చితిని
నేను: ఎంతో సంతోషము. ధన్యుడను.
కృష్ణ: మిత్రులకు పంపిన ఉత్తరములో నన్ను కూడా పెట్టుము.
నేను: తప్పకుండా. నిన్నుకార్బన్ ప్రతి (Cc) నందు పెట్టెదను
కృష్ణ: అద్భుతము

39 వ్యాఖ్యలు:

మధురవాణి said...

మేము మీరిరువురి మిత్రుల సంభాషణలు చదివి ఎంతలా గట్టిగా బయటికి నవ్వుచున్నామో (LOL ) మీకు తెలుస్తున్నదా తెలివైనా అందమైన యువకుడు గారూ! అన్నట్టు, అమ్మాయిలకు గీతలు వేయునపుడు మీ గ్రాంథిక భాషతో జాగ్రత్త సుమండీ! ;-) ;-)

Sai Praveen said...

గీతలు వేయునపుడు దానికి తగు పద్ధతినే అవలంబించెదము. ఎంతైనా మేము అందముతో పాటు తెలివి కూడా కలవారము కదా ;)
వ్యాఖ్యకు ధన్యవాదములు.

nagarjuna said...

అందమైన తెలివైన యువకుడా...సంభాషణ పూర్తిగా రాళ్లు (rocks)

గీత వేయునపుడు అవలంబించాల్సిన పద్దతి ఏమిటో కాస్త గీతపైన చెప్పగలరా..

Sai Praveen said...

నాగార్జున గారు,
ధన్యవాదములు. అటువంటి విషయములు బహిర్గతము చేయరాదు. అయినను మీ అభ్యర్ధనను ఒకసారి పరిశీలింతుము.

శ్రీనివాస్ పప్పు said...

అద్దరగొట్టేహారంతే అందమయిన తెలివయిన యు-వ-కు-డా

Sai Praveen said...

శ్రీనివాస్ గారు,
ధన్యవాదాలు. కాని యువకుడిని అన్ని ముక్కలు ఎందుకు చేసారో అర్ధం కాలేదండి :)

చిలమకూరు విజయమోహన్ said...

:)

కేకే said...

మన అన్నగారు జీవించియున్నయెడల, తమరి తెలుగుతనము చూసి ఎంత మురిసిపోవుదురో కదా. ప్రత్యేకముగా తమకోసము, దానవీరశూరకర్ణ చిత్ర రాజమును పునఃనిర్మించి, అందు సంభాషణలన్నియూ తమరిద్దరి చేతనే రచింపజేసియుండెడివారు కదా.

rishi said...

మీ గీత పై సంభాషణ ఊపినది(Rocked)
>>బాధకు భాష తెలియదురా
ఉక్రోషం అక్షరాలు చూడదురా
పోసాని సినిమా కానీ చూసారా ఏమిటి ఈ మధ్య కాలం లో :)?

Manasa said...

బ్లాగు బహు బాగు బాగు

మీరు కార్బన్ అని రాసితిరి కానీ దానిని తెలుగు లో "కర్బనము" అనేదరు మిత్రమా.http://www.sahiti.org/dict/index.jsp?engWord=carbon

సుజాత said...

నేను కూడా బయటికి పెద్దగా నవ్వితిని యువకుడా!ఇందులో చాలామందికి మీరు వేసిన వ్యంగ్యములు బహు బాగున్నవి. ఇటువంటి తెలుగునే నేడు అందరూ తెలుగని భ్రమించి మనల్ని భ్రమింప జేయుచున్నారు. వారికి ఈ టపా బహు కనువిప్పు కాగలదు.

అబ్బ, లాభం లేదు ! మామూలు భాషలోకొస్తాను.

ప్రవీణ్ గారూ, బాగుంది మీ టపా!

సహజమైన తెలుగు సహజంగానే ఉండాలని మీరిచ్చిన సందేశం చాలా మందికి అంది ఉంటుందని ఆశిస్తున్నాను!

నాగార్జునా,
సంభాషణ పూర్తిగా రాళ్ళు....హ హ !

Sai Praveen said...

@విజయ మోహన్ గారు,
ధన్యవాదాలు :)
@కేకే గారు,
ఎందుకు లెండి. మయసభలో తెంగ్లిష్ మాట్లాడినచో ప్రేక్షకుల మతి భ్రమించును. నిర్మాత జేబుకు చిల్లు పడును :)
@రిషి గారు,
నెనర్లు. ఈ మధ్య కాలములోనే కాదండి. భూతకాలము లో కూడా ఏనాడూ నేను పోసాని సినిమాలు చూసే ధైర్యం చేయలేదు :)
@మానస గారు,
నిజమా?ఆంగ్ల మాధ్యమములో చదవడం వల్ల దానికి ఒక తెలుగు పేరు ఉన్నదన్న విషయమే నాకు తెలియదు. :)
మీ ప్రేమకథ ఎంటండి అలా మధ్యలోనే ఆపేసారు? పాలకోవా రుచి చూపించి వదిలేస్తే ఎలా చెప్పండి :)
@సుజాత గారు,
గట్టిగా నవ్వినందుకు ధన్యవాదాలు. :)
నిజానికి ఇందులో హాస్యం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి. ఈ సంభాషణ జరిగినప్పటికి నాకు అసలు తెలుగులో బ్లాగులు ఉన్నాయన్న విషయమే తెలియదు.
కాని పూర్తిగా తెలుగులో మాట్లాడగలిగే పరిస్థితి ఇప్పుడు లేదన్నది మాత్రం వాస్తవం.

శిశిర said...

:) బాగుంది. అభినందనలు.

కౌండిన్య said...

బహుబాగుగా ఉన్నది మీ టపా.

Sai Praveen said...

@శిశిర,కౌండిన్య,
ధన్యవాదాలు.

Ramakrishna Reddy Kotla said...

ఓ అందమైన తెలివైన యువకుడా..నీ టపా చదువుతూ నవ్వలేక చచ్చాను :-))...

Sai Praveen said...

@కిషెన్,
ఈ సంభాషణ జరుగుతున్నంత సేపు మేము కూడా చాలా నవ్వుకున్నాం :)
నెనర్లు.

తార said...

అందమైన తెలివీన యువకులరా బహు బాగున్నది.

చదువరి said...

అదరగొట్టేసారండి. కబుర్లలో మీ ఇద్దరి సద్యస్ఫూర్తి (స్పాంటేనిటీ) చూసి ముచ్చటేసింది. ముఖ్యంగా ’బాధకు భాష తెలియదురా’ లాంటివి అదిరెన్.

Sai Praveen said...

తార గారు,
ధన్యవాదాలు :)

చదువరి గారు,
మీకు రెండు సార్లు ధన్యవాదాలు.
మెచ్చుకున్నందుకు,ఒక కొత్త పదం నేర్పినందుకు :)

krishna said...

ఓరి అందమైన తెలివైన యువకుడ....

నీ బ్లాగు అద్బుతమైన అలొచన...మన సంభాషణ మరుల చుచి మిక్కిలి సంతొషించితిని .. :)

Sai Praveen said...

మిత్రమా,
ఈ టపాకు సగం కృషి,సగం ఘనత నీవి :)
పై వ్యాఖ్యలలో మెచ్చుకోలు,ప్రతిస్పందనలలో 'ఎంటండి ఈ సోది' లో కూడా సగ భాగం నీది :D

kiran said...

ATY -tooo much.. :)..chala bagundi...mee post oka ettaithe mee prathispandana ఎంటండి ఈ సోది? - idi chusi entha sepu navvano.. :)

Sai Praveen said...

@కిరణ్,
ధన్యవాదాలు. :)

ప్రణీత స్వాతి said...

గ్రాంధికం, మామూలు వాడుక భాష కలిపి వడ్డించారండీ..చాలా బాగుంది.

Sai Praveen said...

@ప్రణీత,
నెనర్లు :)
ఈ మధ్య శంకరయ్య గారి బ్లాగు లో మీ వ్యాఖ్యలు లేకపోవడం చూసి బ్లాగులకు కొన్నాళ్ళు సెలవు తీసుకున్నారేమో అనుకున్నాను. ఏమైపోయారు ఇన్నాళ్ళు? :)

పరుచూరి వంశీ కృష్ణ . said...

అందమైన తెలివైన యువకుడు గారూ ! నవ్వించేసారు .భలే

Sai Praveen said...

@వంశీ కృష్ణ
ధన్యవాదాలు :)

Pranav Ainavolu said...

గీతలు వేయునపుడు కడు జాగ్రత్త వహించవలయును సుమీ!
లేనిచో మన రాతలు మారిపోవును. :D

ప్రవీణ్ గారు... కుమ్మెశారు :)
అదేదో సినిమాలో సుత్తివేలు గారి dialogues గుర్తొచ్చాయి.
మీ పొస్టే అనుకుంటే... comments కూడా పోస్ట్ ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయాయి. రాళ్ళు! LOL

Sai Praveen said...

ప్రణవ్ గారు,
"గీతలు వేయునపుడు కడు జాగ్రత్త వహించవలయును సుమీ!
లేనిచో మన రాతలు మారిపోవును"
మీరు కూడా కుమ్మేసారు కదా. :) నిజమే.. ఈ టపాకి వ్యాఖ్యలు రాసిన వారందరూ కూడా బాగా రాసారు.
ధన్యవాదాలు.

ఏకాంతపు దిలీప్ said...

:-)

Sai Praveen said...

@దిలీప్
ధన్యవాదాలు.

Manasa Chamarthi said...

భలే బాగా రాసారండీ..:):)

Sai Praveen said...

మానస గారు,
ధన్యవాదాలు :)
నిజానికి ఇది టపా కోసం రాసింది కాదండి. నిజంగానే జరిగింది :)

విరిబోణి said...

తెలివైనా అందమైన యువకుడా . ఏమి ఇది మా ఫైన ఇంతలా దయ చూపి , పరి పరి విధముల chekkillu నొప్పి పుట్టెలా నవ్వించిన మీకు ఏమి ఇచ్చి నా ధన్యవాదాలు తెలుపుకోగలను .ఒక చిన్న వ్యాక్యము ( కామెంట్) తప్ప ! :))))))

Sai Praveen said...

మీ చిన్ని వ్యాఖ్యే నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంతకు మించి ఏమి ఆశించగలను :)
ధన్యవాదాలు.

కావ్య said...

చాల బాగుంది అందమైన తెలివైన యువకుడా :p

Sai Praveen said...

ధన్యవాదములు యువతీ :))

Anonymous said...

chala chala bagundhi.
chala sepu navvukunnanu.
super andi