Saturday 31 July 2010

ఫ్రెండ్షిప్ డే - ఒక జ్ఞాపకం

స్నేహం... ఒక అందమైన భావన
స్నేహం... మనిషికి .....

ఇంకా ఏదో రాద్దాం అనుకున్నాను. స్నేహం గురించి ఇప్పటికే చాలామంది చాలా అందమైన వర్ణనలు చేసేసారు, నువ్వు రాసే చెత్త అనవసరం అని అరిచాడు నా ఆత్మా రాముడు. నేను కూడా తగ్గకుండా "నేను సైతం..." అని ఏదో చెప్పబోతుంటే "ఏడ్చావులే, భువన ఘోషలో నీ వెర్రి గొంతుక కూడా కలిసిందని మురిసిపోకు. నీ గొంతు దేనికి కలిపినా అక్కడ శృతి పాడవ్వడం తప్ప ఏమి జరగదు " అని తేల్చేసాడు. ఐ హర్ట్ అని చెప్పి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. (వీడి కవిత చదివే గోల తప్పిందని మీరు కూడా రిలాక్స్ అవ్వచ్చు). కాని నేను అసలు చెప్పాలనుకున్న విషయం వేరు. ఈ విషయంలో మాత్రం ఒక సారి కమిట్ అయిపోయాక నేను ఆత్మారాముడి మాటలు వినను.


ఫ్రెండ్షిప్ డే అనే పదం వినగానే నాకు వెంటనే గుర్తు వచ్చేది 2006 ఆగస్ట్ 6 (ఆ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే). నా జీవితంలో మర్చిపోలేనిది.బహుశా ఇంకో నలుగురి జీవితాల్లో కూడా అది వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు.

(కళ్ళు మూసుకుని మీ కళ్ళ ముందు ఒక టార్టాయిస్ కాయిల్ గిరగిరా తిరుగుతున్నట్టు ఊహించుకోండి. మనం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తున్నాం)

నాలుగు సంవత్సరాల క్రితం. మాకు అప్పుడే ఇంజినీరింగ్ పూర్తయింది. దానికి మూడు నెలల ముందు నుంచే, ఒక పక్క పరీక్షలు , ప్రాజెక్ట్ అనే బాధలు ఉన్నా కాని, స్నేహితులను విడిచి వెళ్ళే రోజు దగ్గర అవుతున్న కొద్దీ అందరు తమ స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ వీలైనంతగా జ్ఞాపకాలు పదిల పరుచుకోవాలని, ఉన్న కొన్ని రోజులని వీలైనంత సరదాగా గడుపుతూ ఇంకొన్ని మంచి జ్ఞాపకాలని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఆ రోజు వచ్చింది. 2006 ఏప్రిల్ 21 . మా ప్రాజెక్ట్ వైవాతో సహా అన్ని పూర్తయిపోయాయి. మా క్లాస్ మేట్స్ అందరం కాలేజి గ్రౌండ్ లో కూర్చున్నాం. కాసేపు కబుర్లు చెప్పకున్నాక అందరు కలిసి ఆ నెలాఖరు వరకు ఊర్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎలాగో వాళ్ళందరూ ఆ నెలాఖరు వరకు రూములకి అద్దెలు కట్టేసారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఇళ్ళలో ఏవో పనులు ఉన్న వాళ్ళు, వెంటనే ఏ ఇంటర్వ్యూ నో అటెండ్ అవ్వాల్సి ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వారందరూ ఉండిపోయారు.ఇంకేముంది. క్లాసులు లేవు, పరీక్షలు లేవు . రోజుకి 24 గంటల సమయం మొత్తం మాదే. ఆ తొమ్మిది రోజుల్లో ప్రతి రోజు ఒక పండగే.

ఆ మరుసటి రోజే అందరం కలిసి అంతర్వేది బీచ్ కి వెళ్ళాం. ఆ రోజంతా అక్కడ గడిపి వచ్చాక ఆ తరవాతి రోజు ఇంకొక చోట మీటింగ్. ఇలా ప్రతి రోజు మీటింగ్ స్పాట్ మారుతుంది కానీ అందరం కలుస్తూనే ఉన్నాం. ఒక రోజు ఊరి బయట పొలాల్లో చిన్న పిక్నిక్ , ఒక రోజు ఊర్లోని పార్క్ లో, ఒక రోజు మధ్యాహ్నం మా ఇంట్లో, సాయంత్రం ఇంకో స్నేహితుడి ఇంట్లో (మేము ఇద్దరం లోకల్స్. మిగిలిన వాళ్ళందరూ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు) , ఈ మీటింగులకి తోడు అంత మందిలో ఏ ఒక్కరు ఇంటికి వెళ్ళిపోతున్నా గుంపు మొత్తం కలిసి రైల్వే స్టేషన్ కో బస్సు స్టాండ్ కో వెళ్ళే వాళ్ళం. మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళినా మా గోల మాదే. రైలో బస్సో కదిలే ముందు ఏడుపులు, కౌగలించుకుని వీడ్కోలు చెప్పుకోవడాలు మామూలే.

అలా ఆ తొమ్మిది రోజులు గడిచాక 30వ తారీఖు సాయంత్రానికి అందరు వెళ్ళిపోయారు. లోకల్ గాళ్ళం మాత్రం మిగిలాం. ఒక వారం పది రోజులు అప్పుడప్పుడు కిరణ్ ని కలుస్తూ ఊర్లోనే గడిపేసిన తరవాత మనం జావా క్లాసులు వెలగబెడదాం అని హైదరాబాద్ చేరాం. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రాచమర్యాదల మధ్యలో ప్రతి రోజు పొద్దున్నే ఠంచనుగా నిద్ర లేచి, స్నానం చేసి, తయారయి, కొంత దూరం ఆటోలో , కొంత దూరం నడిచి వెళ్లి ఒక గదిలో (గది మాత్రమే. అది స్టేడియం కాదు) 250 మందిని కుక్కి కూర్చోబెట్టి బోధించే ఒకానొక అమీర్ పేట కోచింగ్ సెంటర్ లో ఇరుక్కుని కూర్చుని... నిద్రపోయేవాడిని (అందుకే మరి జావా లో నేను కిషెన్ రెడ్డి గారి కథలో కిట్టిగాడి కంటే గొప్ప పండితుడిని  ;) ). క్లాస్ పూర్తవగానే అక్కడికి దగ్గరలో హాస్టల్లో ఉంటున్న మా ఫ్రెండ్ హర్షకి ఫోన్ కొట్టడం, వాడి బండి మీద ఊరంతా బలాదూర్ తిరగడం, తిరిగినంత సేపు తిరిగి ఇంటికి చేరాక సెల్ ఫోన్ లో కబుర్లు మొదలు పెట్టడం నా దినచర్య. అలా 'హచ్' వారి సౌజన్యంతో జీవితం రోజుకి పది ఫోన్ కాల్సూ, వంద SMSలుగా చాలా అందంగా, ఆనందంగా గడిచిపోతోంది. అప్పటికే జాబ్ వచ్చేసిందన్న ఆనందంలో(దీన్ని పొగరు అనాలేమో) అసలు చదవాలనే అనిపించేది కాదు.

ప్రతి రోజు ఎవరో ఒకరిని కలుస్తూ ఉండడం వలనో, చాలా మందితో రోజు ఫోన్ లోనో SMSల లోనో మాట్లాడుతూ ఉండడం వలనో కానీ అందరం విడిపోయాం అన్న బాధ పెద్దగా ఉండేది కాదు. కొన్ని నెలలకి నెమ్మదిగా ఒక్కొక్కరు ఉద్యోగాలలో చేరడం, చదువులకి విదేశాలకి బయల్దేరడం మొదలయింది. మళ్ళీ బాధ. ఇంక వాళ్లతో కలిసి సమయం గడపడం కుదరదని. కొన్ని రోజులకి నాకు కూడా జాయినింగ్ లెటర్ వచ్చింది. ఇంక నేను కూడా ఉద్యోగంలో చేరానంటే అందరు చెప్తున్న యాంత్రిక జీవితం నాకు కూడా మొదలైపోతుంది అన్న బెంగ మొదలయింది. అప్పుడు విన్నాను ఆగస్ట్ 6వ తారిఖు ఫ్రెండ్షిప్ డే అని. అప్పటి వరకు ఫ్రెండ్షిప్ డే గురించి ఎక్కడో చదివి 'ఓహో అలాగా' అనుకోవడం తప్ప ఎప్పుడు అంతగా పట్టించుకోలేదు. కాని ఈ సారి మాత్రం నా ఆలోచనలు అలా లేవు. ఉద్యోగంలో చేరే లోపు కనీసం ఆ రోజున ఏదో ఒకటి చెయ్యాలి! కాని ఏం చెయ్యాలి? ఆ రోజు అందరికి ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్తూ మెయిల్ చెయ్యాలి... ఛీ. ఇందులో పెద్ద వింత ఏముంది. నెట్ లో దొరికే గ్రీటింగ్ కార్డో , ఎప్పుడో సంవత్సరాల క్రితం ఎవడో ఒకడు మెయిల్ లో రాస్తే తరతాలుగా ఫార్వార్డ్ అవుతున్న బుల్లి కవితో అందరు పంపించుకుంటారు ఆ రోజు. మరి ఏం చెయ్యాలి? అందరికి ఆ రోజు ఫోన్ చేసి పర్సనల్ గా విషెస్ చెప్తే... ఈ ఆలోచన బావుంది. కాని ఇంకా ఏదో అసంతృప్తి. అప్పుడు వచ్చింది ఒక ఆలోచన.

ముందు అరవింద్ గాడితో మొదలు పెట్టాను. వాడిని నేను ఫస్ట్ ఇయర్ లో క్లాస్ లో చూసినప్పుడు వాడిగురించి నేను ఏమనుకునే వాడిని, మేము మొదటి సారి ఎప్పుడు కలుసుకున్నాము, అప్పుడు ఏం మాట్లాడుకున్నాము, మా స్నేహం నెమ్మదిగా ఎలా పెరిగింది, తరవాత మా మధ్య జరిగిన సంఘటనలు, ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము, ఎవరి గురించి గాసిప్స్ మాట్లాడుకున్నాము,వాడి అలవాట్లు ఏంటి, వాడిని తలుచుకున్న వెంటనే నాకు గుర్తు వచ్చే విషయం ఏమిటి ఇలా వాడితో నాకు గుర్తున్న ప్రతి సంఘటన, వాడి గురించి గుర్తున్న ప్రతి విషయం రాసుకున్నాను. ఇవి అన్ని కలిపి ఫ్రెండ్షిప్ డే రోజు వాడికి మెయిల్ పంపాలని నా ప్లాన్. అది పూర్తవగానే హర్ష, తరవాత రూప, భార్గవి. ఇలా వీళ్ళందరి గురించి రాసిన పెద్ద పెద్ద మెయిల్స్ వాళ్ళకి పంపించాను. ఆ మెయిల్స్ చివర్లో ఇలా రాసాను 'నేను ఇది పంపిస్తున్నది కేవలం ఇవన్ని గుర్తు చెయ్యడానికి కాదు. ఈ జ్ఞాపకాలని కాపాడుకోవడానికి. నేను ప్రతి ఫ్రెండ్షిప్ డే కి ఈ మెయిల్ తెరచి చదువుతాను.నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను'. అవి చదివిన తరవాత వాళ్ళకి కలిగిన ఆశ్చర్యం, సంతోషాల గురించి చెప్తూ వాళ్ళు పంపిన రెప్లైలు చుసిన తరవాత నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను.


మొదటి రిప్లై అరవింద్ నుంచి వచ్చింది.

"i am veryveryveryveryvery much happy to see this mail and this made me to think all our days we had before made my eyes filled with those memorable moments which we had during those engg days.and hope we meet once again.
i am shocked to this surely i will keep this with me for ever and i will see this mail now and then ."


రూప ఈ మెయిల్ చదవిన వెంటనే ఫోన్ చేసింది. తన మాటలోనే తన సంతోషం తెలుస్తోంది. "సాయి I am very happy. అసలు మనం మొదట మాట్లాడిన విషయం నుంచి అన్ని భలే గుర్తు పెట్టుకున్నావు. అసలు expect చెయ్యలేదు ఇలాంటిది. Thank you. Thank you very much."

భార్గవి మెయిల్ చుసిన తరువాత ఒక సారి, ఇంకొన్నాళ్ళ తరవాత ఒక సారి మెయిల్ చేసింది. 'ఇంతకు ముందు నాకు చదవడం సరిగ్గా కుదరలేదు, ఇప్పుడు పూర్తిగా చదివాను. నిజంగా మొత్తం చదివి స్టన్ అయ్యాను' అని.

అన్నిటిని మించిన రియాక్షన్ హర్ష నుంచి వచ్చింది. వీడికి పంపిన మెయిల్ అన్నిటికంటే పెద్దది. దాదాపు వాడి
డైరీ నేను రాసినట్టు ఉంటుంది. వాడు MS చెయ్యడానికి అమెరికా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలి ని ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళిపోయినందుకు చాలా బాధ పడుతూ ఉండే వాడు. ఈ మెయిల్ చూసి నాకు రిప్లై చేసాడు "అరేయ్ నేను ఇది కొంచెం చదవగానే బాగా ఏడుపొచ్చేసిందిరా. మొత్తం చదివితే నేను తట్టుకోలేను రా." మళ్ళి కొన్నాళ్ళ తరవాత మెయిల్ చేసాడు. "మొత్తం చదివాను రా. నాలుగేళ్ల నా లైఫ్ మొత్తం గుర్తొచ్చింది రా. Thank you very much."

వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషంతో పాటు గర్వంగా కూడా అనిపించింది. ఇంకా నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది గురించి చాలా విషయాలు రాసుకోవాలి అనిపించేది.కాని ఆ తరువాత నేను ప్రయాణాల్లో కొంచెం బిజీ గా ఉన్నాను. రెండు వారాల తరువాత ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. ఇంక తరువాత అంతా కొత్త జీవితం. మిగిలిన ఫ్రెండ్స్ గురించి ఏమైనా రాద్దాం అనుకున్నా కాని అంత తీరిక,ఓపిక ఉండేవి కావు. సమయం దొరికినా కాని గుర్తు తెచ్చుకుందాం అనుకుంటే ఏమి పెద్దగ గుర్తు వచ్చేవి కాదు. అప్పటికే నా మైండ్ సెట్ మారిపోయిందేమో మరి.

ఉద్యోగంలో చేరాక చాలా మంది స్నేహితులు అయ్యారు. చాలా మంది ఇప్పటికే దూరంగా వెళ్ళిపోయారు కుడా. కాని ఎవరి గురించి ఇలా రాయాలి అనిపించలేదు.కారణం, ఉద్యోగంలో జాయిన్ అయ్యాక (ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు) ప్రతి ప్రశ్నకి చెప్పే ఒకే సమాధానం 'తీరిక దొరకట్లేదు'. ఒక వేళ సమయం కుదిరినా అప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు లేదు. అప్పట్లో స్నేహితులు అందరు ఒకే సారి దూరం అయిపోవడం, ఇప్పుడు ఒక్కొక్కరు పరిచయం అయ్యి ఎవరికీ వారు వేరు వేరు కారణాలతో వేరు వేరు సందర్భాలలో దూరం కావడం కూడా ఒక కారణం కావచ్చు.


ఏది ఏమైనా కాని జ్ఞాపకాలను దాచుకోవడం లో ఉండే ఆనందం మాత్రం నాకు బాగా అర్ధం అయింది. ఇప్పుడు కూడా ఎవరితో అయినా కాని మెయిల్ లో కాని, చాట్ లో కాని ఏ మంచి సంభాషణ జరిగినా, నా యాహూ మెయిల్ లో 'memories' అనే folder లో దాచుకుంటాను. అలా దాచినవన్నీ ఈ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే కి వాళ్ళకి పంపించాలి అనుకుంటున్నాను. ఇంకా గత కొన్నేళ్లుగా అంతగా టచ్ లో లేని స్నేహితులు అందరికి ఫోన్ చెయ్యాలి .

కాబట్టి, ఎప్పుడైనా ఎప్పటికైనా 'నువ్వు ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చిన బహుమతులలో అన్నిటికంటే విలువైనది ఏమిటి' అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నా మనసు గర్వంగా చెప్పే సమాధానం 'జ్ఞాపకాలు'. ప్రతి మంచి సంఘటన ఒక మంచి జ్ఞాపకమే. వాటిని పదిల పరుచుకోవడం మన చేతిలోనే ఉంది.

చివరిగా,

బ్లాగ్మిత్రులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

16 వ్యాఖ్యలు:

Anonymous said...

Not bad.

Unknown said...

entha bagundo...naku anni gurthochayi... :)....
nenu oka sari...na frns ki anni frndship quotes rasi..oka miss u mail pettanu..
inko vishayam entante...nake memory power koncham ekkuva ma gang lo.. :)..so nenu rechipothanu....
B.tech chesina prathi vadi life ilage untundemo.. :(...
meeku Happy Friendship day.. :)

swapna@kalalaprapancham said...

miku kooda happy friendship day

Sai Praveen said...

@Anonymous,kiran,swapna
Thank you very much.

krishna said...

బాగుంది రా!
ఈ బ్లాగు చదివాక నా ఇంజినీరింగ్ రోజులు గుర్తుకువచాయి

శిశిర said...

ఈ సంఘటన మీరు నాబ్లాగులో ఒక టపాకి వ్యాఖ్యానిస్తూ చెప్పారు. బాగుంది.

Ram Krish Reddy Kotla said...

ప్రవీణ్ చాలా చక్కగా చెప్పావు :)... ఇకపోతే అమీరుపేటలో జావా ఇన్స్టిట్యూట్ -- అది "ఐనెట్ సాల్వ్" ??..ఏదైనా జావాలో మా కిట్టిగాడినే మించిపోయావ్ అని చెప్తుంటే సంతోషంగా ఉంది ;-)....నువ్వు రాసిన అనుభవాలు చదివి నేను కూడా నా బీటెక్ చివరి రోజులు గుర్తుచేసుకున్నాను... మీ మెయిల్ ఐడీ పంపగలరు..థాంక్స్ ..or mail me at kishen_lively@yahoo.co.in

Sai Praveen said...

@కృష్ణ,శిశిర గారు,
ధన్యవాదాలు.

@కిషెన్,
అది నరేష్ టెక్నాలజీస్ :)
సంతోషం కిట్టి గాడిని గుర్తు పెట్టుకున్నందుకా నాకు జావా రానందుకా ;)

..nagarjuna.. said...

అమీర్‌పేట్ అనగానే నరేష్ టెక్నాలజిస్ అయిఉంటుందనుకున్నా...అదేఅనమాట.

పోస్టు విషయానికొస్తే...ఎంత బావుందో మాటల్లొ చెప్పలేను బాస్. నేను ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాక ప్రెండ్‌షిప్‌ డే రోజు ఓ చిన్న కథను తయారుచేసుకొని స్నేహితులకు మెయిల్ చేసేవాడిని..ఇప్పుడు కుదరక జస్ట్ విషెస్ వెప్పి ఊరుకుంటున్నా...ఎనివే మీ జ్ఞాపకాల ఐడియా బావుంది

Sai Praveen said...

నాగార్జున గారు,
ధన్యవాదాలు. ఇప్పుడు దాదాపు అందరం విషెస్ చెప్పి ఊరుకునే పరిస్థితి లోనే ఉన్నాం. ఈ సారి మాత్రం నేను చాలా రోజుల నుంచి మాట్లాడని ఫ్రెండ్స్ అందరికి వరుసగా ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను. దాదాపు రోజంతా అదే పని మీద ఉన్నాను. చాలా సంతోషంగా అనిపించింది

మనసు పలికే said...

సాయి ప్రవీణ్ గారూ! చాలా బాగున్నాయి మీ టపాలు.:)
అయ్యయ్యో..మన సిరివెన్నెల పడవ ముందుకు కదలడం లేదు కదండీ.. ఏదో ఒక ఇంధనం ఇచ్చి కదిలించండి.. :))

Sai Praveen said...

@అపర్ణ,
మీరు అన్నది సిరివెన్నెల విరిజల్లులు శీర్షిక గురించా? కదులుతుంది. తరువాతి టపా అదే అనుకుంటున్నాను. :)

Unknown said...

Its Gud, Praveen. This made me to recollect my memories :)

Sai Praveen said...

Thank you Siri. :)

విరిబోణి said...

ఎందుకో తెలిసింది ,చదువుతుంటే కళ్ళలో సన్నటి నీటి పొర , నా ఇంజనీరింగ్ జ్ఞాపకాలు కూడా గురుతు వచ్చి :) ఇంతకి I net solve / Naresh technologies ఆ :))) nenu I net solve లో java కోర్సు నేర్చుకున్నా :))

Sai Praveen said...

మీ వ్యాఖ్యకు రిప్లై రాయడానికి ఈ పేజీ తెరిచి చాలా రోజుల తరువాత ఈ టపా మళ్ళీ చదువుకున్నాను. ఇప్పుడు నాకు ఆ మెయిల్స్ అన్నీ మళ్ళీ చదవాలనుంది :)
మీరు అక్కడే జావా నేర్చుకున్నారా.... నేను అక్కడ క్లాసెస్ కి వెళ్లాను. కాని నేర్చుకోలేదు :P