Tuesday, 27 April 2010

సిరివెన్నెల విరిజల్లులు -2 :ఆకాశం తాకేలా...

చిత్రం:నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
గానం:బాలు
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం


దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘం లో నిద్దురపోయిన రంగులు అన్ని రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

||చరణం -1||
ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుప గల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా

ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే
ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే

అది చరితలు సైతం చదవని వైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరిపైరై ఎదిగే వరకు చేనుకి మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

||చరణం -2||
మండే కొలిమినడగందే
తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే

తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరే ప్రియురాలే గెలుపంటే

తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి కనులకు తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపుల్లోతలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతే నువు వెతికే సంక్రాంతై ఎదురవదా  ఈ పాట గొప్పదనం ఏమని చెప్పగలం. ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని చాలా శ్రద్ధగా ఏరుకొచ్చి పేర్చినట్టుగా ఉంటుంది ఇది. 

  చాలా సరళమైన పదాలతో ఎంతో గొప్ప భావాన్ని చెప్పడం ఈ పాట గొప్పదనం. చిత్రం లోని కథా సందర్భాన్ని బట్టి పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేమ గురించి ఇంతకంటే అందంగా ఇంకెవరు చెప్పలేరేమో అన్నట్టుగా చెప్పారు సిరివెన్నెల గారు. 

  టూకీగా ఒక చిన్న మాట. ఈ పాట లోని 'సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే' అనే వాక్యం నాకు నచ్చలేదు. నేను సంగీత ప్రియుడిని (నా బ్లాగ్ పేరు కింద రాసిన వాక్యం చూడండి). సంగీతం కంటే తీయనైనది ఇంకొకటి ఉందంటే నేను ఒప్పుకోనంతే. :) (నేను ఇంకా ప్రేమలో పడలేదోచ్!)

4 వ్యాఖ్యలు:

మధురవాణి said...

ఈ పాట వచ్చిన కొత్తల్లో ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదండి. ఎప్పటికీ వినే పాటల్లో ఇదొకటి. పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది కదూ! ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో లిరిసిస్ట్ కేటగిరీ ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరం ఈ పాటకి సిరివెన్నెల గారికి ఆ అవార్డ్ వచ్చినట్టు గుర్తు నాకు.

Sai Praveen said...

ఈ పాటకి ముందు పిక్చరైజషన్ అయిపోయాక సాహిత్యం రాయడం జరిగిందండి. ఈ విషయం దేవి శ్రీ ప్రసాద్, ప్రభుదేవా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.
హీరోయిన్ గుండె మీద చెయ్యి వేసి సైగ చేసినప్పుడు 'ఎవరి హృదయంలో..' అని, శ్రీహరి, సిద్దార్థ్ కలిసి నడుస్తున్నప్పుడు 'జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే..' అని ఇలా సన్నివేశంతో కలిసే లాగా రాసారు సిరివెన్నెల గారు.

విరిబోణి said...

i love this song :))పిక్చరైజషన్ kooda bavuntadi, ఎంతైనా పల్లెటూరి నుండి వచ్చా కదా, ఆ మట్టి వాసన ఒకసారి పీల్చినంత హాయిగా :)

Sai Praveen said...

నిజమే నంది. పిక్చరైసేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఈ పాటకి.